పవన్ చిరంజీవి ని దాటేశాడా ?
” అత్తారింటికి దారేది ” సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రి లో హీరోగా పవన్
కళ్యాణ్ స్టామినా ఏమిటో అందరికీ స్పష్టంగా అర్ధమైపోయింది. సినిమా విడుదలకు
వారం ముందే పైరసీ సిడి లు మార్కెట్లోకి విడుదల అయినా దాని ప్రభావం సినిమాపై
ఏమాత్రం పడకుండా సూపర్ డూపర్ హిట్ అవటం అన్నది మామూలు విషయం కాదు. తెలుగు
సినిమా గత రికార్డులను తిరగరాస్తూ కనుచూపు మేరలో మరెవరూ వాటిని
తిరగరాయలేనంతగా పవన్ తన పవర్ ను చాటి చెపుతున్నాడు. వాస్తవానికి పవన్ గత
సినిమాలతో పోల్చినా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతకు ముందు దర్శకత్వం నెరపిన
చిత్రాలతో పోల్చుకున్నా ” అత్తారింటికి దారేది ” సినిమా అద్భుతమైన సినిమా
కాదు. మిగిలిన క్వాలిటీల సంగతి ఎలా వున్నా ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్
ఇమేజ్ అనే ఏకైక ట్రాక్ మీద పరుగు తీసిన సినిమా అన్నది నిర్వివాదాంశం. యూత్
లో పవన్ కున్న ఫాలోయింగ్ ఏమిటో ఈ సినిమా విజయం నిరూపించింది. థియేటర్లలో ఈ
సినిమా చూస్తున్నవారికి ఈ విషయం బాగా అర్ధమవుతుంది. మాస్, యూత్ వర్గాల్లో
ఇంతటి ఆదరణ గతంలో స్వర్గీయ ఎన్ టిఆర్, ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ,
మెగాస్టార్ చిరంజీవి లకు లభించింది. అయితే పవన్ కళ్యాణ్ కు లభిస్తున్న ఆదరణ
చూస్తుంటే వారందరినీ తాను అధిగమిస్తున్నాడా అన్న అభిప్రాయం బలపడుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రికార్డులపరంగా ఈ సినిమా నెలకొల్పుతున్న రికార్డులు ఈ
అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒకవిధంగా ప్రస్తుతం గత వారం రోజులుగా
రాష్ట్రం మొత్తం పవన్ జ్వరంతో ఊగిపోతోంది. ఈ విషయంలో పవన్ తన సోదరుడు
చిరంజీవి నెలకొల్పిన రికార్డులన్నింటిని బద్దలు కొట్టడం ఖాయమని సినీ
పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేవలం మొదటివారంలోనే తెలుగు
సినిమా రికార్డులన్నింటిని తిరగరాసిన “అత్తారింటికి దారేది ” సినిమా
రానున్న రోజుల్లో ఇంకెన్ని సరికొత్త రికార్డులను తన ఖాతాలో జమ వేసుకుంటుందో
వేచి చూడాల్సిందేనని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. చాలా గ్యాప్ తరువాత పెద్ద
సినిమా కోసం ఎదురుచూసి మొహం వాచిపోయివున్న తెలుగు ప్రేక్షకులకు పవన్
అద్భుతమైన కానుక నిచ్చాడని సినిమా పెద్దలు విశ్లేషిస్తున్నారు. కంగ్రాట్స్
పవన్ !!