Friday, February 20, 2015

వెండి శిఖరం!

రామానాయుడు ప్రస్తావన లేకుండా తెలుగు చలనచిత్ర చరిత్ర గురించి చెప్పుకోవడం అసాధ్యం. ఆయన జీవితం సినిమాతో అంతగా మమేకమైంది. చిత్రరంగంలోకి అడుగుపెట్టే ప్రతి నిర్మాతకు ఒక నిఘంటువు ఆయన. భారతీయ సినీరంగానికే మకుటాయమానంగా నిలిచిన నిర్మాత. తన ప్రతిభతో ఆ రంగాన్ని మరింత సుసంపన్నం చేసి, సినీ జగత్తుపై చెరగని ముద్రవేశారాయన. చిత్రరంగాన్ని తన శ్రమతో పరిశ్రమగా మార్చిన ధన్యజీవి.
ఒక వృత్తిని, అందునా సినీరంగాన్ని ఎంచుకుని ఆటుపోట్లన్నీ ఎదుర్కొంటూ ఉన్నతశిఖరాలను అధిరోహించడం సాధారణ విషయం కాదు. కఠోరశ్రమ, పట్టుదల, నిరంతర కృషి అందుకు అవసరం. అవన్నీ ఉన్నాయి కనుకనే, రామానాయుడు నలుగురిలో ఒకరిగా కాకుండా ప్రత్యేకంగా నిలిచి వెలిగారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని దూసుకుపోయే చొరవ, ప్రధమస్థానంలో తానే నిలవాలనుకునే స్వభావం ఆయనకు మెండుగా ఉండ టం వల్లే ప్రపంచంలో అత్యధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తిగా ఎదిగి, గిన్ని్‌సబుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. ఈ నెంబర్‌వన్‌ ఆకాంక్షే ఆయనను ముందుకు నడిపించి, ఎన్నో అద్భుతాలు చేయించింది. భారతీయ ముఖ్య భాషలన్నింటిలోనూ 140 చిత్రాలు నిర్మించేట్టు చేసింది. ‘దేవుడు నాకు చదువు ఇవ్వలేదు. కానీ మంచి కథను పసికట్టే తెలివి ఇచ్చాడు’ అని వినయంగా చెప్పేవారు రామానాయుడు. అయినా, అనుభవాన్ని మించిన చదువేముంది? జీవితం కంటే పెద్ద యూనివర్సిటీ ఎక్కడుంది? ఆయన నిర్మించిన ప్రతి సినిమా ఒక మాస్టర్స్‌ డిగ్రీ అనుకుంటే రామానాయుడు 140 డిగ్రీల పట్టభద్రుడు. ఆయన నిర్మించిన ప్రతి చిత్రం విజయవంతం కాకపోవచ్చు, వైఫల్యాలు తప్పకపోవచ్చు. కానీ, అపజయం నుంచి పాఠాలు నేర్చుకునే అద్భుత లక్షణం ఆయనను ముందుకు నడిపించింది. తనేం తీసినా జనం చూస్తారన్న గర్వాన్ని ఆయన ఎన్నడూ దరిచేరనీయలేదు. ప్రతి చిత్రాన్ని తన తొలి సినిమాగానే భావించి అత్యంత శ్రద్ధతో, భయభక్తులతో తీయడం వల్లనే ఆయన చిత్రాలు ప్రేక్షకుల మన్ననలందుకొన్నాయి.
సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారికి అపప్రథలు, ఆటుపోట్లు తప్పవు. దానికి అభద్రత కూడా తోడుగా ఉండే ఆ రంగంలో అసమాన విజేతగా నిలబడిన వారు రామానాయుడు. పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి నిర్మాతకు ఆయన జీవితం పాఠాలు నేర్పింది. సినిమాలను ఇష్టపడే వారుంటారు. ప్రేమించే వారుంటారు. కానీ సినిమాయే జీవితం అనుకున్నారాయన. చిత్రపరిశ్రమే తన ప్రపంచమని నమ్మారు. అనుకున్నది సాధించారు. సంతృప్తికరమైన జీవితం గడిపి వెళ్లిపోయారు. తన కోసం, తన కుటుంబం కోసం నిర్మాతగా మారి సినిమాలు తీసినప్పటికీ, తద్వారా కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధిని కల్పించారాయన. ఎక్కడ సంపాదిస్తావో అక్కడే మరింత అభివృద్థిని సాధించాలనే సిద్ధాంతం ఆయనది. తన తర్వాత కూడా తన పేరు నిలిచిపోయేలా సమాజానికి ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తి ఆయన. ధార్మిక సంస్థల స్థాపనలోనూ, విద్యాలయాలకూ, వైద్యాలయాలకు విరాళాలు ఇవ్వడంలోనూ ఆయన ముందున్నారు. చిత్రపరిశ్రమలో సాధారణంగా అవసరం కోసమే పలకరింపులు, పరామర్శలు ఉంటాయని ఓ విమర్శ. కానీ, అవసరంతో నిమిత్తం లేకుండా అందరినీ చిరునవ్వుతో పలకరించే ప్రేమస్వభావి రామానాయుడు. చిన్నా పెద్దా తేడా ఆయనకు లేదు. అందరినీ ఆదరించి అభిమానించగలిగే లక్షణం ఆయనది. పైకి ఆయన సూటు, బూటు వేసుకున్నా లోలోపల అచ్చమైన పల్లెటూరి రైతులాగే నిష్కల్మషంగా ఉండేవారు.
చిత్ర పరిశ్రమలో సంపాదించిన డబ్బుని ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడిగా మళ్ళించి, మరింతగా సంపాదించుకోవాలనుకొనే నిర్మాతలు ఎక్కువే ఉన్నారు. కానీ సినిమాల ద్వారా తాను సంపాదించిన దానిని తిరిగి అదే పరిశ్రమలో పెట్టిన ఏకైక వ్యక్తి రామానాయుడు. తనకు అన్నంపెట్టే క్షేత్రం మరింత సస్యశ్యామలం కావాలనీ, పచ్చగా పదికాలాలపాటు వర్థిల్లాలని తపించే లక్షణం ఆయనది. ఎందుకూ కొరగానిదనుకొన్న స్థలంలో ఒక అద్భుతమైన స్టూడియోని నిర్మించడం ఆయనకే సాధ్యమైంది. రామానాయుడి ధైర్యానికీ, మొండితనానికీ, పట్టుదలకీ నిలువెత్తు నిదర్శనం రామానాయుడు స్టూడియో. స్టూడియో కట్టడానికి వీలుగా కొండల్ని కరగదీస్తున్నప్పుడు ‘ఏమిటీది!.. నాయుడికి పిచ్చి పట్టిందా’ అని అనుకున్నవాళ్ళున్నారు. ‘సంపాదించిన డబ్బుని ఏ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోనే పెడితే కోట్లు సంపాదిస్తావ్‌... అనవసరంగా రాళ్ళ పాలు చేయకు’ అని సలహాలు చెప్పినవారూ ఉన్నారు. ఎవరేమి అన్నా, వింతగా చూసినా, ఏవో సలహాలు చెప్పినా ఆయన లక్ష్యపెట్టలేదు. చిరునవ్వు నవ్వుతూ తాను అనుకున్నది చేసుకుపోయారు. ‘సినిమా నా ప్రాణం.. అదే నా సర్వస్వం’ అనుకొని వ్యయప్రయాసలకు ఓర్చి స్టూడియో నిర్మించారు. ఫిల్మ్‌నగర్‌ కొండలకి మరింత వన్నె చేకూర్చారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, పరిశ్రమపరంగా, సమాజపరంగా అన్ని విధాల సంపూర్ణమైన జీవితం రామానాయుడిది.
Next
This is the most recent post.
Previous
Older Post

0 comments :

Post a Comment